Saturday 10 June 2017


అంతరంగం



మనసు పలికిన రాగాలెన్నో, పెదవి దాటని భావాలెన్నో, 
నిన్ను చూశాక కలిగిన ఆలోచనలు ఎన్నెన్నో -
 నా అంతరంగం నీతో కలిసి అనుభవించిన జ్ఞాపకాలు మరెన్నో -
నీతో చెప్పాలని , లేఖ రాయటానికి సిద్దమయ్యాను. కానీ !
రాయటానికి ,చెప్పటానికి నా దగ్గర భాష లేదు- 
నీవు నా చెంత లేవు- అందుకే నా విను మిత్రమా -
నీ మనసు నాతో చెప్పె చిలిపి భావనలను - 
నా ఊపిరి నీ గుండెలో ప్రతిద్వనించిన వేళ 
ఆస్వాదించు మిత్రమా నా శ్వాసలో నీ ప్రేమను.
నీకు వర్ణించే శక్తి ఉంటే నీ దగ్గర వున్న నా మనసుకు చెప్పు 
తన ఊపిరి యొక్క స్నేహం గురించి.

Friday 7 April 2017

నాకు నచ్చిన నిషిగంధ గారి కవిత

వలసపక్షి

కొన్నిసార్లు ఏదనీ చెప్పడానికేముండదు..

వద్దనుకున్నవో.. వదిలేసుకున్నవో
పాత బంధాలు
కొత్త బెంగలై
లోపల్లోపల పేరుకోకముందే
తటాలున విదిలించేసుకున్నా
అకారణ దిగులేదో
ఇంటిచూరు పట్టుకుని వేళ్ళాడే మధ్యాహ్నపుటెండలా
ఉత్తినే వేధిస్తుంటుంది..


పచ్చపూలవనాల్లో
అలక్ష్యంగా ఎగిరీ..
ఆగి ఆగి నవ్వుతున్న నక్షత్రాల ఆకాశాన్ని
భుజాన వేసుకుని..
ఎప్పటికీ తిరిగి రాని రెండు ఝాముల కోసం
ఒక వలస పక్షిలా
మళ్ళీ వెళ్ళి వెదుక్కున్నా
పలకరించేది
గోడలు కూలిన రహస్యగృహమే!


ఎందుకో మాట్లాడలేక.. మాట్లాడి ఏమవ్వనూ లేక
మౌనంగానే తేలికవ్వాలంటే..

ఎవరినీ చేరని కలలా
చీకటి చివర్లలో
ఊగుతూ ఒద్దికగా ఉండిపోవాలంతే!


ఉండడమేవిటో…
అంతలోనే లేకపోవడమేవిటో
మృదువుగా కదిలెళ్ళే మేఘంలో
లిఖించబడి ఉంటుంది!
అర్ధమయితే చాలు..
అసహనపు వల వీడిపోతుంది!


విచ్చుకుంటున్న స్వాతిశయపు పూలగుత్తుల్లోంఛి
తోవ చేసుకుంటూ
ఆకాశం సముద్రస్నానం చేస్తున్న
ఆవలి తీరానికి
ఇంకొక సుదీర్ఘ ప్రయాణం మొదలవుతుంది!!

Thursday 23 March 2017

దూరం

దూరం గా మిణుగురు కాంతి
చేరాలని ప్రయత్నిస్తూనే ఉన్నా...
గమ్యం కానరాక నడుస్తూనే ఉన్నా
నా పిచ్చి గాని చేరలేని దూరానికి నడక ఎందుకు ???

Saturday 18 March 2017






నాకు నచ్చిన పాట లోని కొన్ని లైన్స్
మెరుపుల్లో తీగలపైన మైనా కడుతుందా గూడు
 ప్రతి నదికి మలుపులు తద్యం
బ్రతుకుల్లో బాధలు నిత్యం
ఎద గాయం మాన్పును కాలం
సిరివెన్నెల మాత్రం నమ్మి చిగురాకులు బ్రతకవు కదా !
 మిణుగురులే మణిదీపం ........

నేను రాసిన కొన్ని క్రుకీలు ..

నేను రాసిన కొన్ని క్రుకీలు ..

1.నిన్ను పోగొట్టుకున్నాను.నేను రోజు వెళ్ళే చోటే.
2..నిద్రలో కూడా మెలకువగా వుంటోంది నా జీవితం..నీ పరిచయం తర్వాత
3..దోసిలి పట్టా ..నీ నవ్వు నెలవంకలా రాలి పడుతుందని
4..మనం నిర్మించుకున్న తొలి సమాధి ..మౌనం
5. జీవితంలో ఇమడని అనుభూతులు.పదాలు ఒదగని వాక్యాల్లా
6.నమ్మలేనిదేదో జరుగుతుంది...ఆఖరి పేజిలో
7.నువ్వు నాకు శాపమే..ఎప్పటికి అందుకోలేని ఆకాశం లా
8.మౌనం నిశ్శేషంగా నిలబడింది...ముక్కలయ్యే కాలం ముందు
9.అక్షరాలు సైతం విస్తు పోయాయి .కనులు కనులు సంగమించిన చోట
10..మైమరిపించలేవు..గుండెను తట్టిన కధలన్నీ
11.మనసు యుద్ధం చేస్తుంది ..మానవత్వం మరిచిన మృగాడితో
12.శిశిరం లో సైతం వసంతాన్నే చూస్తా..నువ్వు నా తోడు ఉంటే
13..నిర్జీవమైన గతమా...నీ ఆత్మ శాంతి కై ఓ రెండు నిమషాలు
14.జాలిగా చెంపను తడిమింది ..ఉత్తినే అంటించుకున్న ఓ కన్నీటి బొట్టు
15.చేరలేని గమ్యమే ..నీ వెంట నేను చేసే నడక
16.నన్ను నేనే నమ్మిన్చేస్తుంటాను ..అంతా నిజమే నని
17.నిన్ను గతం లోనే దాచేస్తా..నేను కాలం తో పరిగెడుతూ
18.మనసు బాధ అంతా తడిపేసాను..చినుకుల జడిలో
19.ప్రకృతి బీభత్సం మనిషికే...చిగురాకులు గలగలా మంటూ మాట్లాడుతున్నాయి
20.మనసు తడి అవిరయ్యింది ..నీ ఊపిరి సోకి
21.పరిమళపు తుఫాను..నీ ఊపిరి నన్ను సోకగానే
22.వెలుగు నీదే,వెన్నెలా నీదే,ఇంకా వేరే చెప్పాలా నా ఊపిరి నీదే
23.ఘల్లుమని గుండెలో మ్రోగింది..బహుశా నీ ఊపిరి సవ్వ డెమో
24.నా ఊపిరిలో చేరింది.గాలిలో నలిగిన నీ జ్ఞాపకాల పరిమళం
25.ఎర్రటి మట్టిగాజులు గలగల మంటున్నాయి.నీ ఊపిరి సోకిందేమో
26.లోలోపల జ్వలిస్తోంది ..నీ ఊపిరి నా గుండె లయలో
27.ఎందుకలా అనిపిస్తుందో ఒక్కోసారి..నీవు చెంత నున్నప్పుడే ఊపిరి ఆగాలని
28.ఊపిరి ఆగేంత నిశబ్దం..నా నుండి నీవు వేరయ్యాకా
29.నా పేరు నీ ఊపిరిలో చేరింది.నా శ్వాస నీ వయ్యకా
30.ఊపిరి అక్కడే ఆగిన గుర్తు..నువ్వు వెళ్ళిన క్షణమే కదా అది
31.నా లోని ఊపిరి లయను తోలిసారివిన్నాను..నీ పరిచయం లో
32.ఒంటరితనమైనా ఆనందమే...నా తలపుల్లో నీవుండగా
33.విషాదమైనా సంతోషమే..నిత్యం నీ జ్ఞాపకం తోడుండగా
34.నిశబ్దం మాట్లాడుతుంది...ఒంటరితనం ఆక్రమించుకున్న గదిలో
35.మాటల (కో)లాటలలోనువ్వు విసిరిన శరాలు..అంతం లేని ఆవేదనలే
36.కను చూపుల కోలాటాలే .ఏకాంతపు కలయికలో
37.మనసులే ఊసులాడుకొంటున్నాయి..మాటల కోలాటాల జాడ లేక
వేదన 


నీనుండి దూరంగా పోవాలనుకున్నప్రతిసారి కొన్నివేల సార్లుమరణిస్తూఉన్నా

నీ గుర్తులను చెరపాలనుకున్న ప్రతీసారి గుండెల్లో వేదన సంద్రమై నన్నుముంచేస్తుంది

నీ నుండి దూరం గా పోవాలనీ నేను వేసే ప్రతి అడుగును

వెలకట్టలేని నీ ప్రేమ పాశం వెనిక్కిలాగేస్తుంది

నాలో నిరంతరం నీతోయుద్దం జరుగుతూనే ఉంది

ఏమి చెప్పి ఆపాలి..ఈ సమరాన్నితుదిలేని ఈ జీవనపయనాన్ని

 నిరీక్షణ


ఎన్ని యుగాల నిరీక్షణ నీ రాక
వచ్చినట్లే వచ్చి వెనిక్కి తిరిగి పోయావెందుకు ?
ఎన్ని జన్మల అనుభందం ఈ భందం
పెనవేసుకొని ఇంతలోనే ముడి విప్పిపోయావెందుకు ?
ఎన్ని పౌర్ణమి లు ,అమావాస్యలు ,వచ్చి పోయాయో
గుర్తు అయినా లేదు. నీవు తప్ప
ఈ జీవితం లో ఒక్క మిణుగురు పురుగు కాంతి అయినా
కనిపిస్తుందని చూసే నాకు
ఏకంగా నిండు పౌర్ణమినే చూపించావు
అది మొదలు నిత్యం చూస్తూనే ఉన్నా
పిచ్చిదానిలా ... రోజు వెన్నెల ఉండదని తెలిసినా !
నిశబ్దం గా శూన్యం లోకి చూస్తూ ఉన్న
నా జీవం లేని కన్నుల తడి లో మెరుస్తుంది
నీ రూపమే నని నీకెలా చెప్పను

హృదయం
జీవితం ప్రసాదించిన కన్నీటిని హృదయం లోపదిలంగా
దాచుకున్నాను. ఆ తడే కనుక లేకపోతే గుండె ఏనాడో
బీటలు వారి పోయేది.

ఆరాధన





దేవుడిని కొంతమంది ప్రేమిస్తారు. .కొంతమంది ఆరాధిస్తారు
ప్రేమించిన వాళ్ళకంటే ఆరాధించిన వారికే ఎక్కువ హక్కు ఉంటుంది
ఎందుకంటే ఆరాధన లో ఏ స్వార్ధం ఉండదు కాబట్టి .

నలిగే మనసు

నా మనసు నన్నే ప్రశ్నిస్తుంది.
నీవు ఎవరు అని?
నా దేహం నన్నే ప్రశ్నిస్తుంది.
ఇంకా నీ ప్రాణం నాలోనే ఉంది ఏంటి అని?
నా కన్నులు నన్నే ప్రశ్నిస్తున్నాయి.
నీ కన్నీరు..నా కంట కారుతుంది ఏంటి అని?
నా జీవితం నన్నే ప్రశ్నిస్తుంది.
ఇంకెంత కాలం నిన్ను శ్వాసించాలి అని?
అప్పుడు నేను అన్నాను నా కోసం మిగిలింది ఏది లేదు.
నీ పాదాల వద్ద నేను స్వేకరించేది....ఒక్క మృత్యువే అని.
నిర్వేదం 

గడ్డిపువ్వు భూమికి దగ్గరైనట్లు
నీ హృదయం నాకెప్పుడు చెరువే.
అలసిన హృదయానికి ఆలంబనగా .
నీ జ్నాపకం నాకెప్పుడు మధురమే
పాషాణ మౌనంగా నీవున్న నీ జ్నాపకాల పుప్పొడి
నా ఒంటరి రహదారి లో పరుచుకొనే ఉంది.
కాలాల నీడల్లో నువ్వు మాయమైనా ,
నీ జ్నాపకం మాత్రం చలువ రాయి లా నాకింకా జ్ఞాపకమే.
ప్రేమర్పణ అన్నది అతి సుకుమారం,తన పేరు పదే పదే చెప్పుకోదు.
నాకు తెలుసు చిక్కక దోభుచులాడే నీ చీకటి నీ మందిరం లో నా ప్రేమ తృప్తి పడాలని.
నాకు తెలుసు ఈ చీకటి దారులగుండా నన్ను నీ గమ్యానికి చెర్ఛలేవని..
అయినా నా హృదయాన్ని నీకు దీపం గా వెలిగించాను.
ఇప్పుడు నీ మసక బారిన చీకటిని వదిలి కొత్తగా ఉదయించలేవా?
అంధకారం లో అశ్రువులతో నాటే ప్రేమ కోసం నేను కాచుకొని ఉన్నాను....ఉంటాను.
        స్వేచ్ఛ

ఇంక నీ కాళ్ళకి దారం కట్టను.
నీవు ఎగురు నిర్భయం గా .
నీ రహదారి లో చిత్రాలు గీయను.
నీవు నడువు నిస్సంకోచంగా .
నీ మనసుకి వెల్లాడను.
నీవు జీవించు నిరబ్యంతరంగా గా
గొంతుక దాటని పాటలా,
రాయలేని అక్షరం గా,
చెప్పుకోలేని వేదనలా,
వినిపించని సముద్రపు ఘోషలా,
పిచ్చివాని రోదనలా,
చేరుపలేని గీతలా,
నల్లని కన్నుల్లోతడి ఆరని కన్నీటి చుక్క గా ,
నన్ను ఇలాగే ఉండిపోని.
నిన్ను మార్చలేని,మరచిపోని నానిస్సహాయతను  మన్నించు.